'డంకీ' ఫస్ట్ రివ్యూ.. షారుఖ్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల బొమ్మ!
on Dec 21, 2023
ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' సినిమాలతో రెండు సార్లు రూ.1000 కోట్ల గ్రాస్ ఫీట్ సాధించాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఆయన ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అదే 'డంకీ'. అపజయమెరుగని దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు(డిసెంబర్ 21) విడుదలైంది. అసలే షారుఖ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, దానికితోడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకుడు కావడంతో.. 'డంకీ' భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఒక మంచి పాయింట్ ని తీసుకొని.. దానికి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ని జోడించి ప్రేక్షకులను కట్టిపడేయడం రాజ్‌కుమార్ శైలి. 2003లో వచ్చిన 'మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన హిరానీ.. 20 ఏళ్లలో చేసింది ఐదు సినిమాలే. 'మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'లగే రహో మున్నా భాయ్', '3 ఇడియట్స్', 'పీకే', 'సంజు'.. ఇలా ఆయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆరో సినిమాగా 'డంకీ' వచ్చింది.
విదేశాలకు వెళ్లాలనుకునే ఐదుగురి మిత్రుల కథగా 'డంకీ' రూపొందింది. పలు కారణాల వల్ల లండన్ వెళ్లాలన్న వారి కలకు అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో అక్రమ మార్గంలో లండన్ కి వెళ్లాలనుకుంటారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మిగిలిన కథ. రాజ్‌కుమార్ తన గత చిత్రాల తరహాలోనే వినోదం, భావోద్వేగాల మేళవింపుతో 'డంకీ'ని చక్కగా మలిచాడట. డంకీ చూసిన ప్రతి ఒక్కరూ.. సినిమా అద్భుతంగా ఉందని, షారుఖ్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుందని అంటున్నారు.